అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vizag Double Decker Bus | పర్యాటక నగరంగా పేరు పొందిన విశాఖపట్నంలో సందర్శకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ‘హాప్ ఆన్ – హాప్ ఆఫ్’ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ రెండు డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandra Babu Naidu) శుక్రవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యాటకులకు ఓ శుభవార్త తెలిపారు. 24 గంటల టికెట్ ధరను రూ. 500 నుంచి రూ. 250కి తగ్గిస్తున్నట్లు ప్రకటించి అందరిలో ఆనందం నింపారు. మిగిలిన సగం ధరను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం ప్రకటించారు. దీంతో పర్యాటకులు తక్కువ ఖర్చుతో నగరాన్ని కొత్త కోణంలో అన్వేషించుకునే అవకాశం పొందారు.
Vizag Double Decker Bus | ఏయే రూట్స్..
పర్యాటక శాఖ(Tourism Department) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు బీచ్ రోడ్ మీద దూసుకెళ్తూ ప్రయాణికులకు సముద్రతీర అందాలు దగ్గరగా చూపిస్తాయి. బస్సు స్టాపుల వద్ద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కి, దిగే వీలుతో హాప్ ఆన్ – హాప్ ఆఫ్ సౌకర్యం లభిస్తుంది.కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇటీవల ‘నారి’ సర్వేలో మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం(Vishakapatnam) ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు కందుల దుర్గేష్, అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు.
తర్వాత బస్సులో పార్క్ హోటల్ వరకు ప్రయాణించిన సీఎం చంద్రబాబు, దారిపొడవునా ప్రజలకు అభివాదం చేశారు. కొందరిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సరికొత్త పర్యాటక ప్రయత్నం పర్యాటకులకు వినోదం మాత్రమే కాక, నగరానికి ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నిత్యం ఆర్కే బీచ్ నుంచి మరో పర్యాటక ప్రాంతం తొట్లకొండ మధ్య ఈ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొత్తం 16 కిలో మీటర్ల మేర ఈ బస్సులు ప్రయాణిస్తాయి. ఇవి పూర్తిగా హరిత ఇంధన మైన విద్యుత్‌తోనే నడవనున్నాయని తెలియజేశారు. వైజాగ్ బీచ్ రోడ్‌లో సముద్రాన్ని చూసుకుంటూ RK బీచ్, సబ్ మెరైన్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, తెన్నేటి పార్క్, బంగ్లాదేశ్ షిప్, రిషికొండ బీచ్ ను చూసుకుంటూ తోట్లకొండ వరకు ప్రయాణించడం అనేది టూరిస్టులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.