అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రముఖ హాస్య నటుడు, కీర్తిశేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తల్లి అల్లు కనకరత్నం శుక్రవారం అర్థరాత్రి (రాత్రి 1:45) కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదవార్త తెలిసిన వెంటనే ముంబయిలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ మరియు మైసూరులో ఉన్న రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించనున్నారు.
Allu Kanakaratnam | తీవ్ర విషాదం..
మార్చి నెలలో కనకరత్నం అనారోగ్యానికి గురై, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉంచిన అనంతరం ఆరోగ్యం కొంత మెరుగవడంతో డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు కాస్త బాధలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కన్నుమూసిందన్న వార్త అందరిలో విషాదాన్ని నింపింది. ఆమె అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇక అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో కుమారుడు అల్లు అరవింద్ (Allu Aravind), కుమార్తె సురేఖ సినీ వర్గాలకు పరిచితులు. అల్లు కుటుంబ వారసులు అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్, బాబీ, సుష్మిత కొణిదెల సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
2004లో అల్లు రామలింగయ్య మృతి తర్వాత కనకరత్నం పెద్దగా బయట కనిపించలేదు. అయితే, అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె హాజరై అభిమానులను ఆనందింపజేశారు. ఆ వేడుకలో తనయుడు అల్లు అరవింద్, మనవడు అల్లు అర్జున్ (Allu Arjun) చేతుల మీదుగా ఆమెకు సత్కారం చేయించారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్‌పై పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం జామీనుపై విడుదల చేసిన సమయంలో, ఇంటికి వచ్చిన బన్నీకి నాన్నమ్మ కనకరత్నం దిష్టి తీసి, ఆశీర్వదించింది. ఆ సంఘటన వీడియో కూడా అప్పట్లో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.