అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | రెవెన్యూ శాఖ (Revenue Department)లో కొందరు అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ (Warangal Fort) తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడు. ఈ మేరకు ఫిర్యాదులు అందడంలో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం ఉదయం ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వరంగల్లోని ఆయన నివాసంతో పాటు, కార్యాలయం, ఖమ్మంలో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో ఏడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు.
ACB Raid | అక్రమాస్తుల చిట్టా..
తహశీల్దార్ నాగేశ్వర్రావుకు రూ.1.15 కోట్ల విలువైన ఒక భవనం ఉంది. 17.10 ఎకరాల (రూ.1.43 కోట్లు) వ్యవసాయ భూమి, 70 తులాల బంగారు ఆభరణాలు, 1.791 కిలోల వెండి, 23 చేతి గడియారాలు ఉన్నాయి. రెండు కార్లు, ఒక బైక్ ఉన్నాయి. గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ విలువ ప్రకారం దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ACB Raid | చర్యలు కరువు
రాష్ట్రంలో కొందరు తహశీల్దార్లు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అయినా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో తహశీల్దార్లు అటెండర్లు, ఆపరేటర్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు.