అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jio IPO | బిలియనీర్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఇన్వెస్టర్లకు శుభవార్త తెలిపారు. అందరూ ఎదురుచూస్తున్న ఐపీవోకు ఓకే చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జియో ఐపీవో(Jio IPO)కు రానున్నట్లు ప్రకటించారు. రిలయన్స్ జియో(Reliance Jio) దేశీయ స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ అయ్యే అవకాశాలున్నాయి.
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(AGM) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించారు. ఇందులో రిలయన్స్ జియో ఐపీవోకు స్పష్టత ఇచ్చారు. రిలయన్స్ జియో ఐపీవోకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ(Public issue)కు వస్తే దేశ దలాల్ స్ట్రీట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవో అవుతుంది. ఇప్పటివరకు ఆ రికార్డ్ హ్యుందాయ్ ఇండియా పేరుమీద ఉంది. గతేడాది ఈ కంపెనీ 28 వేల కోట్లను సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చిన విషయం తెలిసింది. రిలయన్స్ జియో పరిమాణం రూ. 52 వేల కోట్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. రిలయన్స్ డిజిటల్(Reliance Digital) మరియు టెలికాం ఆస్తులను కలిగి ఉన్న జియో ప్లాట్‌ఫారమ్‌ల విలువ 2020లో 58 బిలియన్ డాలర్లుగా ఉండేది. అప్పట్లో మెటా(Meta) ప్లాట్‌ఫారమ్స్ ఇంక్, ఆల్ఫాబెట్ ఇంక్ రిలయన్స్ డిజిటల్ వెంచర్‌లో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఇందులోనుంచి నిష్క్రమించడానికి వారికి ఐపీవో ఒక అవకాశంగా నిలువనుంది.
Jio IPO | నిబంధనల సడలింపుతో..
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) ఇటీవల మెగా ఆఫర్‌లకు అడ్డంకిగా చాలాకాలంగా పరిగణించబడుతున్న లిస్టింగ్ నియమాలను సడలించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీలకు ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతంకు తప్పనిసరి ఆఫర్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకు వస్తే 5శాతం నిబంధన వల్ల ఫ్లోట్ జియో పరిమాణం 6 బిలియన్ డాలర్లకు మించిపోతుంది. ఇది దేశీయ మార్కెట్లు గ్రహించలేనంత పెద్ద పరిమాణం అవుతుంది. అందుకే జియో ఐపీవోపై రిలయన్స్ ప్రకటన చేయకపోవడానికి ఈ నిబంధనే అడ్డంకిగా మారి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సెబీ కనీస పరిమాణాన్ని 2.5 శాతానికి తగ్గించడంతో ఐపీవోకు లైన్ క్లియర్ అయినట్లు భావిస్తున్నారు. దీంతో 3 బిలియన్ డాలర్ల(3 Billion Dollars)తో రిలయన్స్ జియో ఐపీవోకు వచ్చే అవకాశాలున్నాయి.