అక్షరటుడే, ఎల్లారెడ్డి/లింగంపేట : Pocharam project | లింగంపేట, గాంధారి, రాజంపేట మండలాలతో పాటు, మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్‌లో కురిసిన భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్ట్‌కు (Pocharam project) బుధవారం వరద పోటెత్తిన విషయం తెలిసిందే. జలాశయానికి ఎన్నాడు లేని రీతిలో ఏకంగా 1.82 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.
నిజాం కాలంలో 103 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తయిన పోచారం డ్యామ్‌కు (Pocharam dam) భారీ వరద రావడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరద ధాటికి డ్యామ్ గేట్ల సమీపంలో మట్టి కొట్టుకుపోవడంతో ఎక్కడ కూలిపోతుందోనని అధికారులు ఆందోళన చెందారు. అయితే ప్రాజెక్ట్ వరదను తట్టుకొని నిలబడింది. దీంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Pocharam project | సంతోషంగా ఉంది
‘‘పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని ధైర్యంగా తట్టుకుంది.. 70 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సామర్థ్యంతో (flood flow capacity) దీనిని నిర్మించారు. బుధవారం ఉద్రిక్త క్షణాల తర్వాత, ప్రాజెక్ట్ బలంగా నిలబడటం చూడటం నాకు, నీటిపారుదల సహోద్యోగులకు గొప్ప ఉపశమనం కలిగించింది. నిజంగా గర్వించదగ్గ, భావోద్వేగ క్షణం” అని మంత్రి ట్వీట్ చేశారు. కాగా ప్రాజెక్ట్ కూలిపోతుందేమోని భయంతో అధికారులు దిగువన గల జక్కనపేట, సర్దన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
Pocharam project | మరమ్మతులు చేపడుతున్న అధికారులు
పోచారం ప్రాజెక్ట్ వద్ద అధికారులు వేగంగా మరమ్మతులు చేపడుతున్నారు. వరద ధాటికి డ్యామ్ అప్రోచ్ వాల్ కొట్టుకుపోగా.. ఇసుక బస్తాలు, మట్టితో దానికి మరమ్మతులు చేపట్టారు. మరోవైపు పోచారం ప్రాజెక్ట్ నుంచి భారీ వరద ధాటికి పోచమ్మరాల్, పోచారం గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోవడంతో మెదక్–ఎల్లారెడ్డి మార్గంలో (Medak-Yellareddy route) రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్మీ అధికారులు శుక్రవారం ఉదయం ఘటన స్థలానికి చేరుకున్నారు. తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టారు.