అక్షరటుడే, నిజాంసాగర్ : Manjeera River | ఉమ్మడి మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వానతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చిన విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి వరుణుడు కాస్త శాంతించాడు. దీంతో ప్రాజెక్ట్‌లోకి వరద తగ్గుముఖం పట్టింది.
నిజాంసాగర్ (Nizam Sagar)లోకి ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారులు దిగువకు నీటి విడుదలను తగ్గించారు. 12 వరద గేట్ల ద్వారా కొంతమేర నీటి విడుదలను తగ్గించడంతో దిగువన వరద ఉధృతి తగ్గింది. దీంతో శుక్రవారం ఉదయం చిన్నాపూల్ వంతెన తేలింది. వంతెన మునిగిపోవడంతో అటువైపు గల ఆదర్శ పాఠశాలలో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా భయంభయంగా కాలం వెళ్లదీశారు. ఈ విషయాన్ని పిట్లం ఏఎంసీ ఛైర్మన్ చికోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Laxmikanth Rao) దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మోడల్ పాఠశాల బాలికల వసతి వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం ఖాళీ చేయించారు. విద్యార్థులను కస్తూర్బా గాంధీ వసతి గృహానికి తరలించారు.
ఎస్సై శివకుమార్, పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య వార్డెన్ సరోజన విద్యార్థును ఇళ్లకు పంపించారు.
Manjeera River | నవోదయ పాఠశాలకు..
చిన్నాపూలు వంతెన అటువైపు ఉన్న నవోదయ పాఠశాలకు సైతం రాకపోకలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది నిజాంసాగర్‌కు వచ్చి సామగ్రి కొనుగోలు చేశారు. కాంగ్రెస్ నేతలు మనోజ్‌కుమార్, మల్లికార్జున నవోదయ పాఠశాలకు కూరగాయలు సరఫరా చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో పాటు కాంగ్రెస్ నాయకులు నవోదయ విద్యాలయానికి కాలినడకన వెళ్లి కూరగాయలను అందజేశారు.
