అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్‌సాగర్‌కు వరద పోటెత్తింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
ఎస్సారెస్పీ (SRSP)లోకి ప్రస్తుతం 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి 5.04 లక్షల క్యూసెక్కులను గోదావరి (Godavari)లోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1086.60 (65.135 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.
Sriram Sagar | ముందు జాగ్రత్తగా..
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో జలప్రళయం వచ్చింది. వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. నదులకు భారీగా వరద పోటెత్తింది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా డ్యామ్‌లో నీటిని ఖాళీ చేశారు. మొన్నటి వరకు 80 టీఎంసీల నీటిని నిల్వ చేసిన అధికారులు.. దిగువకు నీటి విడుదలను పెంచి ప్రస్తుతం 65 టీఎంసీల నీటి మట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చినా ప్రాజెక్ట్‌కు ఇబ్బంది లేకుండా దిగువకు నీటి విడుదలను పెంచారు.
Sriram Sagar | కాల్వలకు నీటి విడుదల నిలిపివేత
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా 5.04 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేలు, వరద కాలువ (Varada Kaluva)కు 17,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని వదలడం లేదు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 636 క్యూసెక్కుల నీరు పోతోంది. దీంతో మొత్తం 5,30,622 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
ప్రాజెక్ట్ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఏఈఈ కొత్త రవి సూచించారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటి విడుదల పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు నది సమీపంలోకి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పశువుల కాపార్లు, మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దన్నారు.