అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద ముంచెత్తింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) మెదక్, కామారెడ్డి (Kamareddy), నిజామాబాద్ జిల్లాలు చివురుటాకులా వణికిపోయాయి. వరదల ధాటికి చాలా గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో మూడు రోజులుగా కరెంట్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. అయితే శుక్రవారం సైతం పలు జిల్లాలో వర్షం పడుతుందని అధికారులు తెలిపారు.
వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల్, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షాలు పడుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.
Weather Updates | ఆ జిల్లాలకు ఊరట
అతి భారీ వర్షాలతో మెదక్ (Medak), కామారెడ్డి, నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో జలప్రళయం వచ్చింది. ఇప్పటికి చాలా గ్రామాలు వదర ముంపు నుంచి తేరుకోలేదు. వేలాది ఎకరాల పంటలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు తెగిపోయాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు ఈ జిల్లాలకు ఊరట కలిగించే వార్త చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదని చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Weather Updates | సహాయక చర్యల్లో అధికారులు
వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు (Rescue Operations) చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న పలువురి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.