అక్షరటుడే, వెబ్‌డెస్క్: Blue Egg | కర్ణాటక (Karnataka) రాష్ట్రం దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. కారణం ఆ ప్రాంతంలోని ఓ నాటుకోడి నీలం రంగు గుడ్డు (Blue Egg) పెట్టడం. నల్లూరుకు చెందిన రైతు సయ్యద్ నూర్ తన ఇంట్లో పది నాటుకోళ్లను పెంచుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు.
అయితే, తాజాగా వాటిలో ఒక కోడి పెట్టిన గుడ్డు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిపోయింది. మాములుగా నాటు కోళ్లు తెల్లటి లేదా బ్రౌన్ గుడ్డు (Brown Egg) పెడతాయి. కానీ నూర్ పెంచుకుంటున్న కోడి నీలం రంగు గుడ్డు పెట్టింది! ఇది చూసి రైతు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తర్వాత విషయం ఊరంతా పాకడంతో.. ఆ కోడి పెట్టిన గుడ్డు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Blue Egg | చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన జనం
ఈ వింత గుడ్డును (EGG) చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున నల్లూరు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న గ్రామం సందడిగా మారింది. విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలోని బృందం తక్షణమే గ్రామానికి వెళ్లి ఆ కోడి, గుడ్డును పరిశీలించింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. “బైలివెర్డిన్” అనే పిగ్మెంట్ కొన్ని కోళ్ల జాతుల్లో సహజంగా ఉత్పత్తి అవుతుంది. అదే గుడ్డు శంఖానికి నీలం లేదా ఆకుపచ్చ (blue or green) రంగు తెచ్చే కారణం. ఇది అరుదుగా జరిగే ప్రక్రియ మాత్రమేనని, గుడ్డు రంగు వేరైనా, దాని పోషక విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని వారు స్పష్టం చేశారు.
ఇక గ్రామస్థులు మాత్రం దీనిని శుభశకునంగా భావిస్తున్నారు. “ఈ గుడ్డు గ్రామానికి అదృష్టాన్ని తెస్తుంది” అంటూ నమ్ముతున్నారు. గ్రామస్థుల విశ్వాసానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఇంతవరకు ఎవరు తమ గ్రామంలో ఇలాంటిది చూసిన దాఖలాలు లేవు. అయితే అదే కోడి (Hen) భవిష్యత్తులోనూ ఇలాంటి గుడ్లు పెడుతుందా లేదా అన్న దానిపై అధికారులు జన్యుపరమైన అధ్యయనాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. కోడి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.