అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: CP Sai Chaitanya | రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు.
ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని.. ప్రజల భద్రతా దృష్ట్యా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | అనవసరంగా బయటకు రావొద్దు..
భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సీపీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్‌తీగలు కింద పడ్డట్లయితే వాటిని గమనించి దూరంగా ఉండాలని హెచ్చరించారు. గణేష్ మండలి (Ganesh Mandals) నిర్వాహకులు మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లవద్దని పేర్కొన్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదని, ప్రమాదానికి గురయ్యే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
వ్యవసాయ పనుల (Agricultural work) నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్తు తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పురాతన కట్టడాలు (Ancient buildings) లేదా పురాతనమైన ఇళ్లు, గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా వరద ఉధృతి ఉంటే పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సీపీ పేర్కొన్నారు. ప్రాణనష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
వినాయక విగ్రహం ప్రతిష్ఠించిన చోటా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ వివరించారు. రెవెన్యూ , మున్సిపల్, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.