అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | కుండపోత వర్షాలతో ఎగువ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు 27 వరద గేట్ల ద్వారా 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. కాగా.. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువ భాగంలో గల చిన్నపూల్ వంతెన కొట్టుకుపోయింది.
నిజాంసాగర్ నుంచి నవోదయ పాఠశాలకు వెళ్లే వంతెన కొట్టుకుపోవడంతో నవోదయ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నవోదయలో సుమారు 500 మంది విద్యార్థులు, ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఉన్న సుమారు 90 మంది విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెండు పాఠశాలల చుట్టూ వరదనీరు ప్రవహిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
Nizamsagar | పిట్లం-కల్హేర్ మధ్య రాకపోకలు నిలిపివేత
భారీ వర్షాలతో పిట్లం – కల్హేర్ మండలాల మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్ల వాగు, కాకి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో, ఈ వంతెనపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో పారుతోంది. దీంతో అంతర్ జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Nizamsagar | నిజాంసాగర్‌కు పోటెత్తుతున్న వరద
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 2.18 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో 27 గేట్లు ఎత్తి 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.