అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (District in-charge Minister Seethakka) అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar) టెలి గురువారం జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత, వరద ఉధృతి (Heavy Floods) నష్టపరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎలాంటి అప్రమత్తత లోపం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంతాల ఇళ్లను పరిశీలించి, నీరు చేరిన ఇళ్లలోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. నీటి ముంపు ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు పంపే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ (electricity), వ్యవసాయ (agriculture), తాగునీటి సరఫరా (drinking water supply), పంచాయతీరాజ్ శాఖలు తక్షణం నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని తెలిపారు.
వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు. వాతావరణం అనుకూలించగానే స్వయంగా జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని మంత్రి సీతక్క చెప్పారు.