అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | నిజామాబాద్ జిల్లాలో (Nizamabad) ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు, కాల్వలు అలుగు పారుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మురగడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు.
Heavy Rains | గ్రామాల్లో ఇబ్బందులు..
భారీ వర్షానికి పలు గ్రామాల్లో చెరువులకు గండి పడడంతో ఇళ్లకు నీళ్లు చేరాయి. ఇందల్వాయి (Indalwai) మండలం సిర్నాపల్లి (Sirpally) గ్రామంలో రామన్న చెరువు తెగడంతో నీటి ఉధృతి పెరిగింది. గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే సిరికొండ మండలంలో కప్పల వాగులో భారీ వరద నీరు చేరడంతో కొండూరు గ్రామం జలదిగ్బంధంలో ఉంది.
గడ్కోల్లోనూ (Gadkol) చెరువుకు గండి పడడంతో గడ్కోల్ తూంపల్లికి (Thumpally) రాకపోకలు నిలిచాయి. అటువైపు వెళ్లేవారు ధర్పల్లి(Darpally), సిరికొండ (Sirikonda) మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. మంజీరకు నీటి ప్రవాహం పెరగడంతో బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం హున్సా, ఖాజాపూర్, మందర్నా గ్రామాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. సాలూర వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో అటువైపు రాకపోకలను నిలిపి వేశారు.
Heavy Rains | అత్యవసర పరిస్థితిలో కంట్రోల్ రూంకు సమాచారమివ్వాలి
ఎడతెరిపిలేని వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy)ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడిన కంట్రోల్ రూం 08462 220183 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
Heavy Rains | జిల్లాలో 8 సెం.మీ. వర్షపాతం నమోదు
జిల్లా వ్యాప్తంగా 8.9 సెమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధర్పల్లి మండలంలో 18.9 సె.మీ., సిరికొండ మండలంలో 14.6 సె.మీ., భీమ్‌గల్ మండలంలో 13.3 సె.మీ., ఇందల్వాయి మండలంలో 12.3 సె.మీ., డొంకేశ్వర్ మండలంలో 10.5 సె.మీ., బాల్కొండలో 10.2 సె.మీ. వర్షపాతం నమోదైంది.
చందూరు మండంలో నీటమునిగిన గ్రామాలు..
చందూరు మండలంపై ఉన్న లక్ష్మీసాగర్ వాగు పొంగిపొర్లుతోంది. అలుగెల్లి పారుతోంది. దీందో చందూరు మండలంలోని గ్రామాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. చందూరు–చింతకుంట మధ్య ఉన్న వంతెనపూర్తిగా నీట మునిగింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని వందల ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి. హనుమాన్ మందిరం, ఎల్లమ్మ ఆలయాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొంగిపొర్లుతున్న రామడుగు అలుగు
బోధన్‌లో నీటమునిగిన పొలాలు
గడ్కోల్‌లో నీటమునిగిన పాఠశాల..పక్కనే ఇళ్లు
తెగిన రామన్న చెరువు
సిరికొండ మండలంలోని కొండూరులో నీటమునిగిన ఇళ్లు
ఇందల్వాయిలో రోడ్డు మరమ్మతులు చేస్తున్న పంచాయతీ సిబ్బంది
చందూర్ మండలంలో రోడ్లపై పారుతున్న వరద