అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Visa | అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) దుందుడుకు చర్యల వల్ల విదేశీ విద్యార్థుల అమెరికా డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. వీసాల జారీని కఠినతరం చేసిన ట్రంప్.. ఇప్పుడు తాజాగా వీసాలకు గడువు విధించడంపై దృష్టి సారించారు.
విదేశీ విద్యార్థులకు, పర్యాటకులకు (foreign students and tourists) జారీ చేసే వీసాలపై గడువు విధించాలని యోచిస్తున్నారు. అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఈమేరకు ప్రతిపాదనలు చేసింది. తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు సహా కొంతమంది వీసాదారుల సమయాన్ని పరిమితం చేయడానికి కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఇక నుంచి చదువు కోసం వచ్చే విద్యార్థులు, పాత్రికేయులు తదితరులు నాలుగేళ్లకు మించి ఉండకూడదన్నమాట.
గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. చదువు కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థుల వీసాలకు గడువు ఉండేది కాదు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించి, వీసాను పునరుద్ధరించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తాజా నిబంధనల ప్రకారం.. నాలుగేళ్ల తర్వాత అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. “గత ప్రభుత్వాలు విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు (visa holders) అమెరికాలో వాస్తవంగా నిరవధికంగా ఉండడానికి అనుమతించాయి. అయితే, ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. ప్రభుత్వంపై అనవసరపు భారం పడడంతో పాటు స్థానిక ప్రజలకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే వీసాలపై గడువు విధించాలనే ప్రతిపాదన ముందుకొచ్చిందని” హోం ల్యాండ్ సెక్యూరిటీ (Homeland Security Department official) విభాగం అధికారి ఒకరు తెలిపారు.
US Visa | వీసాలపై గడువు
అమెరికా F వీసా కలిగిన వారిపై (F visa holders) 1978 నుంచి ఎలాంటి నిర్దిష్ట గడువు లేదు. దీనిని ‘స్టేటస్ వ్యవధి’ అని పిలుస్తారు. అటువంటి వీసాదారులు మరింత స్క్రీనింగ్, పరిశీలన లేకుండా నిరవధికంగా అమెరికాలో (America) ఉండగలిగేవారు. అయితే F వీసాదారులు ఈ నిబంధనను సద్వినియోగం చేసుకుంటున్నారని, ఎప్పటికీ విద్యార్థులుగానే అమెరికాలో ఉంటున్నారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. దీని వల్ల భద్రత ముప్పు ఏర్పడడంతో పాటు స్థానికులకు ఉపాధి దూరమవుతోందన్న అభిప్రాయం నెలకొంది. ఈ తరుణంలో విదేశీ విద్యార్థుల వీసాలకు నాలుగేళ్ల గడువు విధించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు.