అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. జిల్లాను అతిభారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టి కారణంగా కామారెడ్డి నియోజకవర్గం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లు ముంపునకు గురయ్యాయి. వరద ప్రభావంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. జనజీవనం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కామారెడ్డి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు ఒక్కసారిగా జలవిలయం సృష్టించాయి. ఇంతటి స్థాయిలో వర్షాలు గతంలో ఎన్నడూ చూడలేదంటే ప్రజలు చర్చించుకుంటున్నారు.
Heavy rains | రవాణా వ్యవస్థ దిగ్బంధం
భారీ వర్షాల నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44 వ జాతీయ రహదారిపై ఎడ్లకట్ట వాగు పొంగి పొర్లడంతో ఒకవైపు రోడ్డు తెగిపోయింది. దాంతో బుధవారం రాత్రి వరకు జాతీయ రహదారిని మూసివేసిన అధికారులు రాత్రి వరకు జేసీబీ సహాయంతో నీటిని మళ్లించి ఒకవైపు రాకపోకలను క్లియర్ చేశారు. పాల్వంచ మండల కేంద్రంలో వాగు ప్రవాహం రోడ్డు పైనుంచి రావడంతో రహదారి దెబ్బతింది. బ్రిడ్జి పరిస్థితిపై ఆందోళన నెలకొనడంతో రాకపోకలను నిలిపివేశారు. దాంతో కామారెడ్డి-సిరిసిల్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు లింగంపేట మండలం కొట్టాల్ వద్ద రోడ్డు తెగిపోవడంతో కామారెడ్డి – ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దేవివిహార్ మొదటి గేటు వద్ద వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో కేవలం 25 శాతం మాత్రమే రాకపోకలు సాగే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Heavy rains | రైళ్ల మళ్లింపు
వరద ప్రవాహం కారణంగా రైళ్లను మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజంపేట మండలం తలమడ్ల రైల్వే ట్రాక్ కింద నుంచి వరద ఉధృతితో ట్రాక్ దెబ్బతింది. దాంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అయితే రైళ్ల రాకపోకలపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. రాయలసీమ ఎక్స్ ప్రెస్ను రద్దు సింది. మహారాష్ట్ర, కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి వైపు వెళ్లే రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
Heavy rains | రాత్రంతా వర్షంలోనే ఉన్నతాధికారులు
కామారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య రాత్రంతా వర్షంలోనే పర్యటించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేశారు. వరద ప్రాంతాల బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Heavy rains | రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
కామారెడ్డిలో వరదల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాయి. బుధవారం రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కామారెడ్డికి చేరుకున్నాయి. తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించాయి. చిన్నమల్లారెడ్డి చెరువులో చిక్కుకున్న ముగ్గురిని బుధవారం అర్ధరాత్రి బోటు ద్వారా రక్షించారు. కట్టేసిన ఆవులను తీసుకువచ్చేందుకు వెళ్లిన తండ్రి కొడుకులు పాల్వంచ వాగులో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. అలాగే కామారెడ్డి జీఆర్ కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో చిక్కుకున్న వికలాంగులురాలితో పాటు మరొక ఇద్దరిని రక్షించారు.
Heavy rains | సీఎం ఏరియల్ రివ్యూ.. మంత్రి పర్యటన
జిల్లాలో వరదల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ చేయనున్నట్టు సమాచారం. వరద బాధిత జిల్లాల్లో ఆయన ఏరియల్ రివ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కామారెడ్డికి రానున్నారు. మొదట హెలికాప్టర్ ద్వారా కామారెడ్డికి రావాలనుకున్నా.. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి లేనట్టుగా సమాచారం. దాంతో రోడ్డు మార్గం ద్వారానే మంత్రి కామారెడ్డి రానున్నట్టుగా తెలుస్తోంది.
Heavy rains | వరద బీభత్సం.. రక్షణ చర్యలు
నియోజకవర్గంలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ప్రాంతాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పర్యటించారు. అధికారులకు సూచనలు అందిస్తూ రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్ గాంధీ హన్మంతు రక్షణ చర్యల్లో పాల్గొని పరిస్థితిని సమీక్షించారు.
- కామారెడ్డి ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి ఉధృతిలో చిక్కుకున్న సుమారు 300 మంది విద్యార్థులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
- ఆవుల కోసం వెళ్లి పాల్వంచ వాగులో చిక్కుకున్న తండ్రి కొడుకులను ఎన్డిఆర్ఎఫ్ బృందం, పోలీసులు రక్షించారు.
- జీఆర్ కాలనీలో చిక్కుకున్న ముగ్గురిని ఎన్డిఆర్ఎఫ్ బృందం రక్షించింది.
- దోమకొండ మండలం సంగమేశ్వర్ వాగు ప్రవాహంలో కారుతో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు 9 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు.
- 44వ జాతీయ రహదారిపై నీటిని మళ్లించి రాకపోకలను క్లియర్ చేశారు
- చిన్నమల్లారెడ్డి చెరువులో చిక్కుకున్న ముగ్గురిని బోటు సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది.
- భారీ వర్షానికి బీబీపేట పెద్ద చెరువు నిండిపోయింది. దాంతో చెరువుకు భంగపడి చెరువు ప్రమాదంలో ఉందని, అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- వరద ప్రాంతాల బాధితుల కోసం కామారెడ్డి పట్టణంతో పాటు నాగిరెడ్డిపేట, మద్నూర్ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.