అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. ఎగువ మంజీరతో పాటు పోచారం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా.. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఎగువ నుంచి 2.31 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
Nizamsagar | ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో 24 వరద గేట్ల ద్వారా మంజీరలోకి 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో మంజీర నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా నల్లవాగు మత్తడి, కళ్యాణి, లింగంపేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సైతం మంజీరలోకి ప్రవహిస్తుండడంతో నదిలో వరద నీరు పోటెత్తుతోంది.
Nizamsagar | బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు
మంజీర నదికి భారీగా వరద వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నది పరీవాహక ప్రాంత గ్రామాలకు ముంపు పొంచి ఉందని అధికారులు సైతం ప్రకటించడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్ మండలంలోని మర్పల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి తరలించారు. అలాగే నిజాంసాగర్ మండల కేంద్రంలోని చిన్న పూల్ వంతెన పైనుంచి నీరు పొంగిపొర్లుతోంది. దీంతో నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి సైతం నీరు చేరింది. అంతేకాకుండా నవోదయ పాఠశాల, ఆదర్శ పాఠశాలలో గల వసతి గృహ విద్యార్థినులు అందులోనే ఉండిపోయారు. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు వారి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పిట్లం మండలంలోని కుర్తి వద్ద వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.