అక్షరటుడే, ఎల్లారెడ్డి/నిజాంసాగర్ : Heavy Floods | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానతో జిల్లా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తునే ఉంది. రికార్డు స్థాయిలో రాజంపేటలో 423 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. భిక్కనూరులో 299 మి.మీ., కామారెడ్డి పట్టణంలో 236మి.మీ. వర్షం కురిసింది. ఎల్లారెడ్డి మండలంలో వర్షాలతో పలు చెరువులు తెగిపోయాయి.
Heavy Floods | రాకపోకలు బంద్

ఎల్లారెడ్డి పట్టణ శివారులోని వడ్డెర కాలనీ వద్ద ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై వరద పొంగిపొర్లడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద రుద్రారం- ఎల్లారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొట్టాల్ – లక్ష్మాపూర్ వంతెన వరద తాకిడికి తెగిపోయింది. శివపూర్ వద్ద రోడ్డు తెగిపోవడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సజ్జనపల్లి వద్ద సైతం బ్రిడ్జిపై నుంచి నీరు పారుతోంది. అటువైపు ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.
Heavy Floods | నీటమునిగిన పొలాలు
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలో గల రెడ్డికుంట చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరి పొలాలు నీట మునిగాయి. గండి మాసానిపేట్ వద్ద పోచారం కాలువ కట్టపై నుంచి నీరు పారుతోంది. ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిపై మోబిన్ భాయ్ పొల్టిఫాం బ్యాక్ సైడ్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ వద్ద పలు కార్లు వాగులో కొట్టుకుపోయాయి.
Heavy Floods | పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు సుల్తాన్ నగర్ మాంజీర పరివాహక ప్రాంతంలో పర్యటించారు.
Heavy Floods | పోచారం ప్రాజెక్ట్‌కు వరద
నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రాజెక్ట్‌కు భారీగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ మీద నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ప్రాజెక్ట్ దిగువన మెదక్–ఎల్లారెడ్డి మార్గంలో గల వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న వంతెన పిల్లర్లు పూర్తిగా వరదలో మునిగిపోయాయి.