అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పై కీలక్ అప్డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఓటరు జాబితా సిద్ధం (Voter List) చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అన్ని గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయాలని పేర్కొంది. 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాలని, అనంతరం సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.
Local Body Elections | ఆశావహుల్లో ఉత్కంఠ
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. ఏడాదిన్నరగా జీపీలకు సర్పంచులు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిరీక్షిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు ఆశావహులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశం ఎటు తేలకపోవడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేసింది. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో గ్రామాల్లో సందడి మొదలైంది. పోటీ చేయాలనుకుంటున్న వారు రిజర్వేషన్లపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తమ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందోనని చర్చించుకుంటున్నారు.
Local Body Elections | పార్టీపరంగా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులను కేంద్రం పక్కన పెట్టింది. మరోవైపు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో బీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు (High Court) ఆదేశించింది. ఈ క్రమంలో పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని సర్పంచ్, వార్డు సభ్యుల సీట్లలో 42 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. అలా అయితే మిగతా పార్టీలు సైతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయని, లేకుంటే ఆ పార్టీలకు బీసీలపై ప్రేమ లేదని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలిసింది.