అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నిత్యం ఏసీబీ (ACB) దాడులు చేపడుతున్నా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. డబ్బులు తీసుకోనిదే పనులు చేయడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఉపాధి హామీ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికాడు.
సిద్దిపేట (Siddipet) జిల్లా మద్దూరు ఎంపీడీవో ఆఫీస్లో బండకింది పరుశురాములు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) ఇంజినీరింగ్ సలహదారుడిగా పని చేస్తున్నాడు. మండలంలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి బిల్లుల కోసం ఆయనను ఇటీవల ఓ వ్యక్తి కలిశాడు. ఉపాధి హామీ పనుల కొలతల తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి బిల్లుల మంజూరు కోసం ఉన్నత అధికారులకు పంపడానికి ఆయన లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో మంగళవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.11,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇంజినీరింగ్ కన్సల్టెంట్ పరుశురాములును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ACB Raid | అనేక అక్రమాలు
ఉపాధి హామీ పనుల్లో అనేక అక్రమాలు జరుగుతాయి. గ్రామీణ స్థాయిలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్ల (Field Assistants) నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడతారు. కూలీలు హాజరు కాకపోయిన వచ్చినట్లు నమోదు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు డబ్బులు కాజేసిన ఘటనలు అనేకం వెలుగు చేశాయి. పలువురు ఉపాధి హామీ ఏపీవోలు, మండల పరిషత్ కార్యాలయం (MPDO Office)లోని అధికారులు సైతం ఉపాధి పనుల బిల్లుల కోసం లంచాలు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి పనుల్లో అక్రమాలు సామాజిక తనిఖీ వేదికల్లో వెలుగు చూసినా.. అధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు. దీంతో అక్రమాలు, అవినీతి అలాగే కొనసాగుతోంది.
ACB Raid | భయపడకుండా ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.