అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | రాష్ట్రంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఓ వైపు వర్షం పడుతున్నా భక్తులు వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ (Khairatabad)లో కొలువుదీరిన వినాయకుడి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన వెంట పూజల్లో పాల్గొన్నారు. నగరంలో వర్షం పడుతున్నా.. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Khairatabad Ganesh | మహాశక్తి గణపతిగా..
ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. స్వామివారికి ఇరువైపులా శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి, ఖైరతాబాద్ గ్రామదేవత గజ్జలమ్మ ఉన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.
Khairatabad Ganesh | గణేశుడి దర్శనానికి వచ్చి..
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూలైన్లో ప్రసవించింది. రాజస్థాన్‌కు చెందిన రేష్మ బుధవారం స్వామివారి దర్శనం కోసం వచ్చింది. అయితే లైన్లో ఉండగా.. నొప్పులు రాగా స్థానికులు అక్కడే ఆమె ప్రసవం చేశారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
నగరంలో వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండపాల నిర్వాహకులు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకోగా.. వర్షంతో ఆటంకం ఏర్పడుతోంది. ఇంట్లో పూజలు చేసుకోవడానికి భక్తులు సామగ్రి కొనుగోలు చేయడానికి వీలు లేకుండా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది.