అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ED | వైద్య కళాశాలల్లో నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) కోటాలో ప్రవేశాలు పొందేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించిన ముఠాను దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఛేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాల సహాయంతో జరిగిన దర్యాప్తులో ప్రైవేట్ వైద్య కళాశాలలు నకిలీ పత్రాలను(Fake Documents) ఉపయోగించి MBBS కోర్సులో దాదాపు 18,000 ప్రవేశాలను ఆఫర్ చేశాయని తేలింది.
ఈ కళాశాలలు NRIల రాయబార కార్యాలయ పత్రాలు, నకిలీ ఫ్యామిలీ పత్రాలను తయారు చేయడానికి ఏజెంట్లకు డబ్బు చెల్లించినట్లు గుర్తించింది. ఏజెంట్లతో కుమ్మక్కయిన వైద్య కళాశాలలు(Medical Colleges) చాలా మంది అభ్యర్థులకు ఒకే పత్రాల సెట్ను ఉపయోగించడం గమనార్హం. కొంతమంది నిజమైన NRI అభ్యర్థులు కూడా ఈ ముఠాతో చేతులు కలిపారు. తమ పేర్లను ఉపయోగించుకున్నందుకు గాను ఏజెంట్ల నుంచి డబ్బు తీసుకున్నారు. ఆయా కళాశాలలపై దాడుల సమయంలో అనేక నకిలీ NRI సర్టిఫికెట్లు(Fake NRI Certificates), స్టాంపులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
నిబంధనల ప్రకారం, NRI కోటా ద్వారా ప్రవేశం పొందుతున్న విద్యార్థుల ఫీజులను NRI బంధువు చెల్లించాలి. కానీ, చాలా సందర్భాలలో ఫీజులను NRI కుటుంబ సభ్యులు చెల్లించలేదని ED దర్యాప్తులో తేలింది. ఫోర్జరీ పత్రాల గురించి విదేశాంగ శాఖ సమాచారం అందించినప్పటికీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా అధికారులు NRI కోటా కింద కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అనర్హుల ప్రవేశంపై ఎటువంటి చర్య తీసుకోలేదని దర్యాప్తు సంస్థ గత నెలలో తెలిపింది.
పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రైవేట్ కాలేజీకి చెందిన రూ.6.42 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ED తెలిపింది. ఈ అక్రమాలకు పాల్పడిన కొన్ని కళాశాలలు. వ్యక్తులకు చెందిన రూ.12.33 కోట్ల విలువైన ఆస్తులను గతంలోనే అటాచ్ చేసింది. “విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన కొంతమంది NRI స్పాన్సర్ల కేసుల్లో ఫోర్జరీ గురించి వర్గీకృత సమాచారం ఉన్నప్పటికీ, సంబంధిత రాష్ట్ర అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు” అని దర్యాప్తు సంస్థ తెలిపింది.