అక్షరటుడే, ఆర్మూర్: Agricultural mechanization | రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందించనున్నారు.
ఈ మేరకు పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైందని ఆలూరు (Aluru) వ్యవసాయ అధికారి రాంబాబు తెలిపారు. జిల్లాకు మొత్తం 6,742 యూనిట్లు కేటాయించగా, మొదటి విడతగా రూ.1.67 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
Agricultural mechanization | పథకం కింద సబ్సిడీ..
ఈ పథకం కింద 11 రకాల వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ (Subsidy) వర్తించనుందని చెప్పారు. ఐదెకరాల్లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ లభించనుందన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులు పట్టాపాస్‌బుక్, ఆధార్ జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో లబ్ధి పొందని రైతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.
ఈ పథకం కింద బ్యాటరీ స్ప్రేయర్లు (Battery sprayers), పవర్ స్ప్రేయర్లు (Power sprayers), రోటావేటర్లు, సీడ్ డ్రిల్లులు, నాగళ్లు, గ్రాస్ కటర్లు, పవర్ టిల్లర్లు, విత్తనాలు నాటే యంత్రాలు, గడ్డికట్టలు చేసే పరికరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులు పరికరాలు సరఫరా చేసే కంపెనీ పేరుతో డీడీ తీసుకురావాలని వ్యవసాయాధికారి రాంబాబు సూచించారు.