అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) ప్రవేశపెట్టారు. ఈ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవాడ వరలక్ష్మీనగర్‌లో ప్రారంభించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో సాంకేతికతను వినియోగించి స్మార్ట్ కార్డులు రూపొందించాం. ప్రతి కార్డులో QR కోడ్ ఉంటుంది. కార్డు ద్వారా రేషన్ తీసుకున్న వెంటనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమాచారం అందేలా వ్యవస్థను రూపొందించాం” అని తెలిపారు.
Smart Ration Cards | 9 జిల్లాల్లో ఇంటింటికీ పంపిణీ
ప్రస్తుతం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఇంటింటికీ కార్డుల పంపిణీ జరుగుతోందని మంత్రి తెలిపారు. మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15లోగా ఈ కార్డులు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కొత్త రేషన్ కార్డులతో పాటు చిరునామా మార్చిన వారికి కూడా కార్డులు అందజేస్తామని తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాలను(E-POS Machines) ఆధునికీకరించడం జరుగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో గోధుమల పంపిణీ కూడా రేషన్ దుకాణాల ద్వారానే చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 29,797 రేషన్ దుకాణాలు ఉన్నాయని, ప్రజల అవసరాల మేరకు వాటి సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. అవసరమయ్యే ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కూడా వివరించారు. ఇలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.