అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bapatla | ఈ మధ్య దొంగతనాలు చేసే వాళ్లు చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ విలువైన సొత్తు దోచుకుంటున్నారు. ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తూ అందినకాడికి ఎత్తుకొని పోతున్నారు. తాజాగా బాపట్ల (Bapatla) జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగిన భారీ చోరీ ఘటన వ్యాపార వర్గాలలో కలకలం రేపుతోంది. ముంబయి నుంచి చెన్నైకి ఎలక్ట్రానిక్ వస్తువులతో (Electronic Items) కూడిన నాలుగు కంటైనర్లను తరలిస్తుండగా, అందులో ఒకదానిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ప్రణాళికాబద్ధంగా చోరీకి పాల్పడ్డారు. దాదాపు 255 ల్యాప్‌టాప్‌లు చాకచక్యంగా అపహరించబడ్డాయని సమాచారం.
Bapatla | ప్లాన్ ప్రకారమేనా..?
శనివారం అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద కంటెయినర్‌లో ఉన్న అలారం బ్రేక్(Alarm Break) అయినట్లు కంపెనీకి సమాచారం అందడంతో ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే లారీ డ్రైవర్ మరియు క్లీనర్ పరారయ్యారు. చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకున్న కంపెనీ ప్రతినిధులు, నిన్న మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. చీరాల డీఎస్పీ మొయిన్ (Chirala DSP Moin) మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల విలువ సుమారుగా రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై వ్యాపార వర్గాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. రవాణా వ్యవస్థ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీ యాజమాన్యం (Company Ownership) పలు జాగ్రత్తలు తీసుకొని వాటిని తరలించిన కూడా ఇలా చోరీ జరగడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ చేసిన వారిని వీరైనంత త్వరగా పట్టుకుంటామని కంపెనీ ప్రతినిథులకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.