అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ‘రెండున్నరేళ్లుగా మాకు పీఈటీ ఉపాధ్యాయుడు లేడు. ఇక్కడున్న ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై హైదరాబాద్ పంపించారు. మాకు క్రీడలు ఆడించే వారే లేరు. వెంటనే మా ఉపాధ్యాయుడిని మాకు పంపించండి’ అంటూ కామారెడ్డి(Kamareddy) మండలం చిన్నమల్లారెడ్డి బాలుర పాఠశాల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల వద్ద ధర్నా చేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు(Alumni Students) మాట్లాడుతూ పాఠశాలలో శివరాం అనే వ్యాయమ ఉపాధ్యాయుడు గతంలో విదులు నిర్వర్తించేవారన్నారు. అయితే అతడిని రెండున్నరేళ్ల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ డిప్యుటేషన్(Hyderabad Deputation) వేశారని వివరించారు. దీంతో ఆయన అక్కడే ఉంటున్నారని.. కానీ వేతనం మాత్రం ఈ పాఠశాల నుంచే పొందుతున్నాడని తెలిపారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థులు క్రీడలు లేక చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరపున మూడు నెలల నుంచి కలెక్టర్(Collector), డీఈవో(DEO)లను కలిసి విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారానిక్ నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలిగి ఉండాలంటే వ్యాయమ ఉపాధ్యాయుడు అవసరమన్నారు. ఈ పాఠశాలలో నియమింపబడిన ఉపాధ్యాయుడు ఇక్కడనే పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.