అక్షరటుడే, ఇందూరు: chit fund : నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు తాజాగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో రైడ్ చేసి పెద్ద మొత్తంలో నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నిజామాబాద్ నగరంలోని ఓ చిట్ఫండ్లోనూ పోలీసులు సోదాలు (Police Raids) జరిపారు. ఈ సంస్థలో భారీ మొత్తంలో నగదుతోపాటు అప్పులిచ్చి తనఖా పెట్టుకున్న డాక్యుమెంట్లు బయటపడ్డాయి. తదుపరిగా నాలుగో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సదరు చిట్ఫండ్ సంస్థ గత కొన్నేళ్లుగా నిజామాబాద్ నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే చిట్ఫండ్ నిర్వహణకు అనుమతులు తీసుకుని, అధిక వడ్డీలకు ఫైనాన్స్ ఇస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ నేపథ్యంలోనే శనివారం (ఆగస్టు 23) సదరు సంస్థకు చెందిన కార్యాలయంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో రూ. 1.04 కోట్ల నగదు, అప్పు కింద తనఖా పెట్టుకున్న 15కు పైగా ఆస్తి పత్రాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
అయితే పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో నిర్వాహకులు.. నగదు చిక్కకుండా డబ్బు కట్టలను బయటకు విసిరేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు మొత్తం నగదును సీజ్ చేసి, పంచుల సమక్షంలో పంచనామా పూర్తి చేశారు.
chit fund : ఆస్తులు తాకట్టు పెట్టుకుని అప్పుల మంజూరు..
ఈ చిట్ఫండ్ (chit fund) కంపెనీ నిర్వాహకులు పోలీసులకు అడ్డంగా దొరికినట్లు తెలుస్తోంది. పలువురి ఆస్తి తాలుకా పత్రాలను కుదవ పెట్టుకోవడంతోపాటు మరికొందరి ఆస్తులను నేరుగా రిజిస్ట్రేషన్ చేయించున్నారు. ఆ తర్వాతే కోట్లాది రూపాయలను అప్పుగా పెద్దమొత్తంలో వడ్డీకి ఇచ్చినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన పత్రాలలో లిఖిత పూర్వకంగా రాసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ కేసును మరింత లోతుగా విచారణ చేయించాలని కమిషనరేట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
chit fund : వదిలిపెట్టాలని పైరవీలు..
చిట్ఫండ్ సంస్థపై పోలీసులు రైడ్ చేసిన అనంతరం కేసు నమోదు కాకుండా తప్పించుకునేందుకు కంపెనీ నిర్వాహకులు పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నేరుగా రంగంలోకి దిగి, అక్కడే తిష్ట వేసినట్లు సమాచారం. తనకున్న పరిచయాల ద్వారా అధికార కాంగ్రెస్ ముఖ్య నేతలతో పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిడి చేయించినట్లు విశ్వనీయ సమాచారం.
జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతోపాటు బీజేపీ ముఖ్యులతో కూడా ఒత్తిడి తెచ్చినా.. పోలీసులు తలొగ్గలేదని తెలిసింది. ప్రత్యేకించి సీపీ సాయి చైతన్య ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వడ్డీ వ్యాపారుల దందా కేసులను పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కాగా, చిట్ఫండ్ ముసుగులో వడ్డీ దందా నిర్వహించడంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.