అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic Challan Scam | గుంటూరు జిల్లా (Guntur district) దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో సైబర్ మోసగాళ్లు మరోసారి చలానా పేరుతో భారీ మోసం చేశారు. స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ట్రాఫిక్ చలానా మేసేజ్ (traffic challan message) నమ్మి ఆన్‌లైన్ మోసానికి బలయ్యారు.
ఈ ఘటనలో ఆయనకు రూ. 1.36 లక్షల ఆర్థిక నష్టం ఏర్పడింది. శుక్రవారం రాత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫోన్‌కు “మీ వాహనంపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలానా ఉంది. వెంటనే చెల్లించండి” అనే సందేశం వచ్చింది. ఏపీ పోలీసుల అధికారిక మెసేజ్‌లాగే కనిపించిన ఈ సందేశంలో ఒక లింక్ కూడా ఉండింది. ఆ లింక్‌పై క్లిక్ చేయడంతో ఒక యాప్ డౌన్‌లోడ్ అయింది. యాప్ ఓపెన్ చేయగానే ఓటీపీ అడగడం చూసి అనుమానం వచ్చి, వెంటనే అప్లికేషన్‌ను క్లోజ్ చేశారు.
Traffic Challan Scam | అప్రమత్తత అవసరం..
నిరంజన్ రెడ్డి క్రెడిట్ కార్డు (Credit Card) నుండి రూ. 61,000, రూ. 32,000 గానూ డబ్బులు డెబిట్ అయినట్లు శనివారం ఉదయం మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించినా, అప్పటికే మరోసారి రూ. 20,999 కూడా వెనక్కి పోయింది. ఇలా మొత్తం ఆరు దఫాలుగా రూ. 1.36 లక్షలు మాయమయ్యాయి. ఈ డబ్బుతో ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్లు కొన్నట్లు నిరంజన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే స్పందించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police), మోసానికి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అని గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇటువంటి ఫేక్ చలానా మెసేజ్‌ల (fake challan messages) ద్వారా మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారిక వెబ్‌సైట్లే కాకుండా ఎలాంటి అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దు. ఏదైనా చలానా చెల్లింపు సంబంధిత సమాచారం కోసం మీ సేవ లేదా పోలీసు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించుకోవాలి. మోసం నిరోధించేందుకు చిట్కాలు ఏంటంటే.. అసలు లింక్‌లను క్లిక్ చేయకండి, బ్యాంక్ / కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి, అనుమానాస్పద యాప్‌లు డౌన్‌లోడ్ (App Download) చేయవద్దు. మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ 1930 నంబర్ కు కాల్ చేయండి. ఈ ఘటన మరోసారి సైబర్ అవగాహన అవసరాన్ని స్పష్టం చేసింది. సెక్యూరిటీ పరిజ్ఞానం లేని ప్రతి ఒక్కరూ టార్గెట్‌గా మారవచ్చు అనే విషయాన్ని నిరంజన్ రెడ్డి అనుభవం గుర్తు చేస్తోంది.