అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijayawada Kanakadurgamma Temple | విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న ప్రసిద్ధ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి (Sri Durga Malleswara Swamy) వార్ల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయ తలుపులు తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ఆలయ ఈవో వీకే శీనానాయక్ ప్రకటించారు. వైదిక సంప్రదాయాలను అనుసరించి, గ్రహణ ప్రారంభానికి ముందు 6 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ మేరకు సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆలయం మూసివేయబడుతుందని, ఆలయ వర్గాలు తెలిపాయి.
Vijayawada Kanakadurgamma Temple | చంద్రగహణం కారణంగా..
ఈవో శీనానాయక్ ప్రకారం, సెప్టెంబర్ 7 రాత్రి 9:56 గంటల నుంచి అర్ధరాత్రి 1:26 గంటల వరకు చంద్రగ్రహణ కాలం ఉంటుంది. దాంతో ఆలయం అంతటినీ మూసివేసి, దేవతలకు గ్రహణ స్పర్శ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రహణం ముగిసిన అనంతరం, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరుచుకుంటాయి. ఆలయంలో (Temple) సంప్రోక్షణ, స్నపనాభిషేకం, తదితర శుద్ధి కార్యాచరణలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం అర్చన, మహా నివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గ్రహణ దుష్ప్రభావాలను నివారించేందుకు ఆలయ కమిటీ (temple committee) పలు సేవలు, హోమాలను రద్దు చేసింది. ఉదయం నిర్వహించాల్సిన సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన. నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమంని కూడా రద్దు చేశారు. అలాగే, ఉదయం 7:30కు ప్రారంభించాల్సిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమం సేవలు ఘంట ఆలస్యంగా ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 8 ఉదయం 8:30 గంటల తర్వాత భక్తులకు సాధారణ దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. మొదటిది మార్చి 13-14 తేదీల్లో ఏర్పడింది, కానీ అది భారత్‌లో కనబడలేదు. ఇప్పుడు సెప్టెంబరులో రాబోయే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా (Australia), అమెరికా, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో స్పష్టంగా కనిపించనుంది. గ్రహణ కాలంలో భక్తులు ఆలయానికి రాకుండా ఉండాలని, సంబంధిత సేవల రద్దును ముందుగానే గమనించాలని కోరారు.