అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sudhakar Reddy | కమ్యూనిస్ట్ నాయకుడు (Communist leader) సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం నివాళులు అర్పించారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.
సురవరం సుధాకర్‌రెడ్డి (Suravarm Sudhakar Reddy) మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఉంచారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మృతి బాధాకరం అన్నారు. ఆయనది రాజీపడని నిరాడంబర జీవితం అని కొనియాడారు. ఏ రోజూ అహంకారాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వలేదన్నారు. సుధాకర్ రెడ్డి సూచన మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామని గుర్తు చేశారు. అనంతరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.
Sudhakar Reddy | ఆవేదనకు గురి చేసింది
విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మఖ్దుం భవన్‌లో ఆయన మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపి, తమతో నడిచిన వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజా ఉద్యమాలు చేసిన వారికి సానుభూతి తెలిపారు.
Sudhakar Reddy | గాంధీ ఆస్పత్రికి పార్థీవదేహం
సురవరం సుధాకర్ రెడ్డి పార్థీవదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు మఖ్ధుం భవన్‌లో కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు. వైద్య విద్యార్థుల పరీక్షల కోసం ఆయన మృతదేహాన్ని అప్పగించనున్నట్లు సీపీఐ కార్యదర్శి నారాయణ తెలిపారు.