అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షాలు (Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులు పాటు వానలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులుగా వాన తెరిపినివ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. రోజంతా వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఆగస్టు 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి.
Weather Updates | రైతుల హర్షం
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో (Heavy Rains) వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. నదులకు వరద పోటెత్తింది. చెరువులు నిండుకుండలా మారి అలుగు పారాయి. ప్రాజెక్ట్‌లకు సైతం భారీగా వరద రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు (Ground Water) సైతం పెరిగాయి. అన్ని ప్రాజెక్టులు (Projects) నిండడంతో వాటి కింద ఉన్న ఆయకట్టుకు రెండు పంటలకు ఢోకా లేదని అన్నదాతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వానలు గ్యాప్ ఇవ్వడంతో పొలాలకు ఎరువులు చల్లడం, పురుగు మందులు పిచికారీ చేయడం లాంటి పనులు చేస్తున్నారు.