అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stray dogs | కుక్కలకు (Dogs) ఆహారం పెట్టినందుకు మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా ఇటీవల వీధికుక్కలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కుక్కల బెడద ఎక్కువైంది. వీధి కుక్కలు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ఎంతో మంది గాయపడుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ముఖ్యంగా పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల వీధికుక్కల పంచాయితీ సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరగా.. కోర్టు సైతం తీవ్రంగానే స్పందించింది. వీధికుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆదేశించింది. అయితే అనంతరం తన తీర్పుపై సమీక్షించుకొని కుక్కలకు వ్యాక్సిన్లు వేసి అదే ప్రాంతంలో వదిలేయాలని సూచించింది.
Stray dogs | ఆహారం పెట్టినందుకు
ఘజియాబాద్‌లో తన అపార్ట్‌మెంట్ సమీపంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినందుకు మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. యాషికా శుక్లా అనే మహిళ కుక్కలకు ఆహారం పెట్టింది. విజయనగర్‌లోని బ్రహ్మపుత్ర ఎన్‌క్లేవ్ సొసైటీకి చెందిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి దాడి చేశాడని శుక్లా తెలిపారు. 40 సెకన్ల వ్యవధిలో ఆమెను అతడు 8 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. ఈ వీడియో వైరల్ అయింది. అయితే మొదట మహిళే తనను కొట్టిందని ఆయన పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కమల్ ఖన్నా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Stray dogs | కుక్కలతో ఎన్నో ఇబ్బందులు
వీధికుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వాటికి ఆహారం పెడుతుండటంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుప్రీం కోర్టు సైతం రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టడాన్ని తప్పు పట్టింది. కుక్కల మీద ప్రేమ ఉన్న వ్యక్తులు ఇంటికి తీసుకు వెళ్లి ఆహారం పెట్టాలని, అప్పుడు ఎవరు అడ్డుకుంటారని పేర్కొంది. తాజాగా కుక్కలకు ఆహారం పెట్టడంతో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి మహిళపై దాడి చేయడం గమనార్హం.