అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandrababu | కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన్ రంగా (Vangaveeti Mohan Ranga) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అవమానించారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో, దుండగులు విగ్రహంపై పేడ పూయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.ఈ ఘటనపై వంగవీటి రంగా అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే దురుద్దేశంతో ఈ చర్యలు చేశారని ఆరోపిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహాలను అవమానించే చర్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
CM Chandrababu | దారుణం..
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించిన కూడా ప్రభుత్వం సహించదని ఆయన హెచ్చరించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇది ఓ కుట్రలా అనిపిస్తోందని, కావాలనే ఉద్రిక్తతలు సృష్టించేందుకు చేసిన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. నిందితులని తక్షణమే అరెస్ట్ చేసి, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని, పారదర్శకంగా దర్యాప్తు జరిపి నివేదిక విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
విగ్రహానికి అవమానం (Statue Insult) జరిగిందని తెలుసుకున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆయన అనుచరులు వంగవీటి రంగా విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే నిందితులను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు వంగవీటి రంగా అభిమానులు, ప్రజా సంఘాలు సంయమనం పాటిస్తూ న్యాయం కోసం వేచి చూస్తామని అన్నారు.