అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నగరంలో ఎన్నో అక్రమ కట్టడాలను హైడ్రా (Hydraa) కూల్చివేసింది. పదుల సంఖ్యలో పార్కుల్లో కబ్జాలను తొలగించింది. ఏడాదిలో నగరంలో 500 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
తాము వందేళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రంగనాథ్ తెలిపారు. గతేడాది జులైలో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నగరంలో ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
Hydraa | ఎఫ్టీఎల్ మార్క్ చేస్తున్నాం
నగరంలోని చెరువులను కొందరు వ్యక్తులు సీఎస్‌ఆర్ (CSR) పేరుతో ఆక్రమించుకోవడానికి యత్నించారని హైడ్రా కమిషనర్ ఆరోపించారు. ప్రస్తుతం సాంకేతిక ఆధారాలతో ఎఫ్టీఎల్ మార్క్ చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల వద్ద భూముల ధరలు రూ.కోట్లు పలుకుతుండడంతో ఆక్రమించుకుంటున్నారని పేర్కొన్నారు. చెరువులతో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా పనిచేస్తుందన్నారు. తమకు రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
Hydraa | దేశంలో ఎక్కడా లేదు
హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదని రంగనాథ్ తెలిపారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్న పనులు చేపడుతున్నట్లు వివరించారు. వరదల్లో మురుగు నీరు సమస్య పరిష్కరించడంతో పాటు వర్షాల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టడం కూడా తమ లక్ష్యమన్నారు. నగరంలోని నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు.