అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Speaker | ఫిరాయింపు ఎమ్మెల్యే అంశాన్ని తేల్చేందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar) సిద్ధమయ్యారు. మూడు నెలల్లోపు ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన చర్యలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్.. ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జూలై 25న న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులను మూడు నెలల్లోపు పరిష్కరించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరో ఐదుగురికి కూడా రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.
Telangana Speaker | స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) నుంచి పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. కడియం శ్రీహరి, కృష్ణమోహన్‌రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్, మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. సభాపతి నుంచి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఫిర్యాదులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు తీర్పు మేరకు అక్టోబర్ 25 లోపు ఫిరాయింపులపై ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉన్న నేపథ్యంలోనే సభాపతి తొలి విడుతలో ఐదుగురు ఎమ్మెల్యే(MLA)లకు నోటీసులు జారీ చేశారని తెలిసింది. మిగతా వారికి నోటీసులు ఇచ్చి, వారి నుంచి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనసభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం.. పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Telangana Speaker | పార్టీ మారలేదంటున్న ఎమ్మెల్యేలు
కోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఎక్కడ అనర్హత వేటు పడుతుందోన్న భయం పట్టుకుంది. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు కోర్టు తీర్పు తర్వాత మాట మార్చారు తాము కాంగ్రెస్‌లో చేరలేదని, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నామని మాత్రమే చెబుతున్నారు. వీరిలో కొందరు తాము కాంగ్రెస్‌లో చేరలేదని ప్రకటించారు. ఒక్క దానం నాగేందర్ మినహా మిగతా వారిపై అనర్హత వేటు పడకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్.. గత లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేశారు. ఫిరాయింపుల వ్యవహారంలో ఇదే కీలకంగా మారడంతో ఆయన అనర్హత వేటు తప్పదని తెలిసింది. మరోవైపు, ఐదుగురికి నోటీసులు జారీ చేసిన స్పీకర్ కార్యాలయం.. విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని అందులో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు విధించిన గడువు లోప ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతందా? స్పీకర్ తన నిర్ణయం ప్రకటిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.