అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amaravati | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Amaravati)లో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) యోచిస్తోంది. ఈ మేరకు తమకు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఉంది. అయితే ఇక్కడ అంతగా మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ క్రమంలో అమరావతిలో సకల హంగులతో దేశంలోని పెద్ద స్టేడియాల్లో ఒకటిగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ఏసీఏ భావిస్తోంది. రాజధాని ప్రాంతంలో తమకు 40 ఎకరాల స్థలం కేటాయిస్తే 60 వేల మంది కూర్చేనే సామర్థ్యంలో స్టేడియం ఏర్పాటు చేస్తామని ఏసీఏ పేర్కొంది. దీని నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
Amaravati | అన్ని జిల్లాల్లో..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ స్టేడియాలను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏసీఏ పేర్కొంది. ప్రస్తుతం మంగళగిరి, ములపాడు (విజయవాడ), విశాఖపట్నం, విజయనగరం, అనంతపురంలలో స్టేడియాలు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో భూసేకరణ పూర్తవడంతో త్వరలో స్టేడియాల నిర్మాణం చేపడుతామన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో స్టేడియాలు నిర్మిస్తామని పేర్కొంది.
Amaravati | వైజాగ్ స్టేడియానికి మరమ్మతులు
వైజాగ్ స్టేడియం (Vizag Stadium) గతంలో వసతులు లేక అధ్వానంగా మారిందన్నారు. మూడు నెలల్లో దానికి మరమ్మతులు చేశామని ఏసీఏ గౌరవ కార్యదర్శి సనా సతీశ్ తెలిపారు. దీంతో బీసీసీఐ ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లు నిర్వహించిందని గుర్తు చేశారు. అంతేగాకుండా వైజాగ్‌కు ఐదు మహిళా ప్రపంచ కప్ మ్యాచ్‌లను మంజూరు చేసిందన్నారు.
స్టేడియాల నిర్మాణంతో పాటు క్రీడాకారులను తయారు చేయడంపై ఏసీఏ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. దీనికోసం అకాడమీలు ప్రారంభించనున్నట్లు సతీశ్ తెలిపారు. ప్రతి అకాడమీలో 15 మంది శిక్షకులు, కోచ్‌లు, ఫిజియోలను నియమిస్తామన్నారు.