అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | వీధికుక్కల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వీధికుక్కలకు డీవార్మింగ్ చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది, టీకాలు వేసిన తర్వాత వాటిని షెల్డర్ల నుంచి విడుదల చేసి వాటి అసలు స్థానాలకు తిరిగి పంపించాలని సూచించింది. దూకుడు ప్రవర్తనను ప్రదర్శించే లేదా రేబిస్ సోకిన కుక్కలకు ముందుగా టీకాలు వేయాలని విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసు(Steet Dogs Case)లో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. త్రిసభ్య ధర్మాసనం వీధి కుక్కలపై దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. కుక్కలకు టీకాలు వేసి, డీవార్మింగ్ (Deworming) చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్/ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని వీధి కుక్కల రహితంగా మార్చాలనే లక్ష్యంతో పరిధిలోని వీధి కుక్కలను తక్షణమే తరలించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ (Delhi) పరిధిలో కుక్క కాట్లు పెరిగి మరణాలు ఎక్కువ సంభవిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. అయితే, జంతు హక్కుల కార్యకర్తలు, ప్రముఖుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో కోర్టు ఈ నిర్ణయాన్ని సమీక్షించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా గత తీర్పులో సవరణలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగస్టు 11న, కుక్క కాటు (Dog Bite) సంఘటనలు, రాబిస్ కేసులు (Rabies Cases), సంబంధిత మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోగా ఆశ్రయాలకు తరలించాలని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2024లో కనీసం 37 లక్షల కుక్క కాటు, 54 అనుమానిత రేబిస్ మరణాలు నమోదయ్యాయి.