అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Megastar Chiranjeevi | టాలీవుడ్ గాడ్‌ఫాదర్, ఇండియన్ సినిమా బిగ్ బాస్ చిరంజీవి నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన చిరంజీవి, సినీ ప్రపంచంలో ఓ సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి, టాలెంట్, కష్టపడే తత్వం, పట్టుదలతో భారతీయ సినిమాకే ఓ బ్రాండ్‌గా మారారు.
అభిమానులు అత్యంత ఉత్సాహంగా, హర్షాతిరేకాలతో ఈ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. వివిధ నగరాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు (Chiranjeevi Birthday Celebrations) ప్రారంభమయ్యాయి.కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Sivashankara Varaprasad)గా జన్మించిన చిరంజీవి, నటనపై ఉన్న ఆసక్తితో మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఆ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, జీవన పోరాటం ఆయనను వెనక్కి లాగలేకపోయాయి. 1978లో ‘పునాది రాళ్లు’ సినిమాతో తెరంగేట్రం చేసిన చిరు, ‘ప్రాణం ఖరీదు’, ‘మనవూరి పాండవులు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Megastar Chiranjeevi | ‘ఖైదీ’తో క్రేజ్
1983లో విడుదలైన ‘ఖైదీ’ చిత్రం చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ కెరీర్‌కి మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆయన స్టార్డమ్ అమాంతం పెరిగిపోయింది. డ్యాన్స్, యాక్షన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌లో తనదైన మార్క్‌తో తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన చిరు, ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేకవీరుడు – అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’, ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా MBBS’ వంటి చిత్రాలతో తన ఖ్యాతిని మరింత పెంచుకున్నాడు. 155కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి, దక్షిణాది సినిమా పరిమితుల్లోనే కాకుండా హిందీలోనూ తన ప్రత్యేకతను చాటారు. ‘ఆజ్ కా గుండారాజ్’, ‘ది జెంటిల్ మెన్’ వంటి సినిమాలతో నేషనల్ రేంజ్‌లో గుర్తింపు పొందారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎంత విస్తృతమో, మానవతావాదిగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అంతే.
‘చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్’(Blood & Eye Bank) స్థాపించి వేలాది మందికి జీవదాతగా నిలిచిన చిరంజీవి, తన సొంతంగా చేయాలన్న తపనతో ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’(Chiranjeevi Charitable Trust) ద్వారా సేవలందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. ప్రస్తుతం చిరంజీవి, వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం ‘విశ్వంభర’ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా మొత్తం చిరు ఫోటోలు, వీడియోలు, ట్వీట్లతో నిండిపోయింది. #HappyBirthdayChiranjeevi, #MegaStarAt70 వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.