అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను ప్రియుడితో హత్య చేయించిన మహిళకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మహిళతో పాటు ఆమె ప్రియుడికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (District Judge) వరప్రసాద్ గురువారం తీర్పునిచ్చారు.
కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన షబ్బీర్ 2022 నవంబర్ 20న కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆయన భార్య నసీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే నెల 22న తాడ్వాయి (Tadwai) మండలం కనకల్ గ్రామం శివార్‌లోని ఉసిరికాయల గడ్డ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించగా.. షబ్బీర్ శవమని గుర్తించారు. తన భర్త హత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్లో నసీమా ఫిర్యాదు చేసింది.
Kamareddy | తమ బంధానికి అడ్డువస్తున్నాడని..
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. భార్య నసీమా తీరుపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో ఆమె వడ్డే హన్మంతు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని నసీమా భర్త హత్యకు ప్లాన్ వేసింది. తన భర్తను హత్య చేయమని హన్మంతుకు చెప్పగా అతను బైక్పై కనకల్ గ్రామ శివారులోకి తీసుకొని వెళ్లి మద్యం తాగించి తలపై కర్రతో కొట్టి చంపాడు. అక్కడే ఉన్న గుహలో మృతదేహం పడేశాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి మృతుడి భార్య, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధించారు. హన్మంతుకు రూ.10 వేలు, నసీమాకు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.