అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Employees | ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరుబాట పట్టనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేదు. దీంతో ఉద్యోగ జేఏసీ (Employee JAC) నాయకులు ఉద్యమానికి సిద్ధం అయ్యారు. 200కు పైగా ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. హామీల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రిటైర్డ్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.
Employees | ఉద్యమ కార్యాచరణ ప్రకటన
ప్రభుత్వం తమ సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించినట్లు నాయకులు తెలిపారు. పెండింగ్ బిల్లులు, డీఏ(DA)ల మంజూరు, పీఆర్సీ (PRC) అమలు తదితర 63 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అలాగే ఉద్యోగుల చైతన్యం కోసం సెప్టెంబర్ 8 నుంచి నుంచి బస్సు యాత్ర (Bus Yatra) చేపడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 8న వరంగల్ జిల్లాలో, 9 న కరీంనగర్, 10న ఆదిలాబాద్, 11న నిజామాబాద్, 12న సంగారెడ్డి, మెదక్, 15న వికారాబాద్, రంగారెడ్డి, 16న మహబూబ్నగర్, 17న నల్లగొండ, 18న ఖమ్మం, కొత్తగూడెం, 19 నుంచి మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర సాగనుంది.
Employees | ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలి. సీపీఎస్ (CPS) రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కోసం ఆదేశాలు జారీ చేయాలి. 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి. జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. అర్హత ఉన్న వారికి సకాలంలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.