అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK Party | తమిళనాడు (Tamil Nadu)లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్నాయి. అయితే పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి.
అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవం కోసం అన్నాడీఎంకే కష్ట పడుతోంది. మరోవైపు తమిళనాట పట్టు సాధించాలని బీజేపీ సైతం ప్రయత్నాలు చేస్తుండగా.. కొత్తగా పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్ (Vijay) అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడులోని మధురైలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు.
TVK Party | టీవీకే, డీఎంకేకు మధ్యే పోటీ..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే(DMK)కు, టీవీకే పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ అన్నారు. బీజేపీ (BJP) తమ భావజాల శత్రువు అని, రాజకీయ విరోధి డీఎంకే అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తానే పోటీ చేస్తున్నట్లు భావించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థిని చూడుకుండా తనను చూసి ఓటు వేయాలని కోరారు. ‘‘మీ ఇంటి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మరెవరో కాదు నేను. ఆ అభ్యర్థి నేను ఒకటే. వారికి ఓటు వేయడం అంటే నాకు వేసినట్లే.” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తాను మధురై ఈస్ట్ (Madurai East)నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
TVK Party | సింహంలా వస్తున్నా..
తమిళనాడులో వేట మొదలైందని విజయ్ అన్నారు. సింహంలా సింగిల్‌గా వస్తున్నట్లు చెప్పారు. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి కానీ సింహమే మృగరాజు అన్నారు. అందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. డీఎంకే, బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
TVK Party | బహిరంగ సభలో విషాదం
టీవీకే బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. సుమారు నాలుగు లక్షల మంది వచ్చిన ఈ సభలో దాదాపు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు.