అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | నిజామాబాద్ జిల్లాలో కొన్ని సహకార సంఘాల (Cooperative societies)లో అవినీతికి బాధ్యులైన అధికారులు, కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి (Anvesh Reddy) కోరారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)కు లేఖ రాశారు.
రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాలు బీఆర్ఎస్ (BRS) హయాంలో అవినీతిలో కూరుకుపోయాయన్నారు. కొందరు అధికారులు, ఆడిటర్లు చేసిన నిర్లక్ష్యంతో సొసైటీలు, రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసే అధికారులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో తప్పిదాలు జరిగాయన్నారు.
Nizamabad | ఏళ్లుగా ఒకే చోట విధులు
కొందరు ఆడిట్ అధికారులు (Audit Officers) చాలా సంవత్సరాల నుంచి అదే జిల్లాలో విధులు నిర్వహిస్తూ, సహకార సంఘాలలో జరిగిన అవినీతిని కప్పి పుచ్చుతున్నారని అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. వారి స్వలాభల కోసం మొత్తం సహకార వ్యవస్థనే నిర్వీర్యం చేశారన్నారు. చివరకు సెక్షన్ 51 ఎంక్వెరి చేసిన దానిలో కూడా అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు కూడా తమ దృష్టికి అనేక విషయాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తప్పులను కప్పిపుచ్చడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సొసైటీల్లో గత పదేళ్లలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Nizamabad | సొసైటీలు నిర్వీర్యం
అధికారులు, సభ్యుల అవినీతితో జిల్లాలోని చాలా సొసైటీలు నిర్వీర్యం అయ్యాయని అన్వేష్‌రెడ్డి అన్నారు. మాక్లూర్, పాల్దా, తాళ్లరాంపూర్, వెంపల్లి, పడిగెల, ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో లావాదేవీలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆడిట్, విచారణలో అవినీతి బయటపడినా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆడిట్ వ్యవస్థపై విచారణ చేపట్టాలన్నారు. పదేళ్ల ఆడిట్ రిపోర్టులు, స్పెషల్ ఆడిట్ రిపోర్టులు, సెక్షన్ 51, 52 నివేదికలను సమగ్రంగా పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.