అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అర్హులకు మాత్రమే ఇల్లు మంజూరు చేయాలని, ఎలాంటి అవకతకవకలు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయినా పలువురు అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా పాలకీడు మండలం జాన్‌పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్య ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయమై ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో రెండు రోజుల క్రితం వెంకయ్యను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
ACB Case | డబ్బులు ఇస్తేనే బిల్లులు
గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ప్రాసెస్ చేయడానికి సెక్రెటరి వెంకయ్య లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా డబ్బులు మంజూరు చేసినందుకు, రెండో విడత బిల్లు కోసం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఓ వ్యక్తిని రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. అతడు బతిమిలాడటంతో రూ.15 వేలకు తగ్గించి తీసుకున్నాడు. అయితే ఈ విషయమై కేసు నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ ఏసీబీ అధికారుల (ACB Officers)ను ఆదేశించారు. అప్పటి నుంచి జీపీ సెక్రెటరీ పరారీలో ఉండగా.. గురువారం అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.