అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం (State Forensic Department) కీలకం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని (Mobile forensic vehicle) అందజేసింది.
ఈ వాహనాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ ఫోరెన్సిక్ వాహనం జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనుందన్నారు.
ఇకపై ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ (Finger prints) అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ వాహనంలో చేరుకుంటారన్నారు. సంఘటన జరిగిన స్థలం నుండి పలు రకాల సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు.
అనంతరం సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (Chaitanya Reddy), డీఎస్పీలు శ్రీనివాస్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, క్లూస్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.