అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
లింగంపేట మండలం (Lingampet Mandal) ముట్టడికింది పల్లెకు చెందిన ఎరుగుదిండ్ల చిన్నక్క పింఛన్ తీసుకునేందుకు ఈనెల 4న సాయంత్రం లింగంపేటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో చిన్నక్క తమ్ముడు మారుతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
మృతురాలు ఫోన్ నంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో లింగంపేట మండలం పర్మల్ల తండాకు (Parmalla Thanda) చెందిన బాదావత్ ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. లింగంపేట కల్లు కాంపౌండ్ వద్ద చిన్నక్కతో చనువుగా ఉండి డబ్బులు ఆశ చూపి రామాయంపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ ఇద్దరికి గొడవ జరిగింది.
ఈ గొడవలో నిందితుడు చిన్నక్కను కొట్టి చీర కొంగుతో ఉరివేసి హత్య చేసి ఫోన్ తీసుకుని పారిపోయాడు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు ప్రకాష్ గతంలోనూ ఓ మహిళ అదృశ్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.