అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఇన్ఫ్లో భారీగా వస్తుండడంతో మూడురోజులుగా నీటిని మంజీరలోకి (Manjeera) వదులుతున్నారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నాటికి ప్రాజెక్టులోకి 52,477 ఇన్ఫ్లో వస్తుండడంతో 9 వరద గేట్ల ద్వారా 37,290 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు ఈఈ సోలోమన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1402.20 అడుగుల (13.94 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
Nizamsagar Project | పర్యాటకుల సందడి
నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్న విషయం తెలుసుకున్న పర్యాటకులు ఇతర జిల్లాల నుంచి సైతం వస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర(Maharashtra) ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.
పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్సై శివకుమార్ (SI Shiva Kumar) బందోబస్తు చర్యలను చేపట్టారు. ప్రాజెక్టు వద్ద నీటి విడుదలతో పాటు గార్డెన్లో పర్యాటకులు సేదదీరుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి చేస్తూ అక్కడే ఉత్సాహంగా గడుపుతున్నారు.