అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్(Hyderabad) నగరంలో రూ.400 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. ఆయా భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది. నగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లు, పార్కుల రక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District) శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలో జూబ్లీ ఎన్‌క్లేవ్ ఉంది. ఈ ఎన్ క్లేవ్లో రోడ్లతో పాటు పార్కులున ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టారు. 22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో ఈ లేఅవుట్(Lay Out)కు అనుమతి తీసుకున్నారు. ఇందులో నాలుగు పార్కులు ఉండగా రెండింటిని కబ్జా చేశారు. దాదాపు 8500 గజాల పార్కులను ఆక్రమించారు. అంతేగాకుండా ఐదు వేల గజాల మేర రోడ్డును సైతం కబ్జా చేశారు.
Hydraa | ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో..
లే అవుట్లో పార్క్‌లు, రోడ్లు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు హైడ్రా ప్రజావాణి(Prajawani)కి ఫిర్యాదులు చేశారు. జైహింద్‌రెడ్డి లే అవుట్లని పార్క్ స్థలాలు, రోడ్లు ఆక్రమించారని పేర్కొన్నారు. అంతేగాకుండా హైటెక్ సిటీ– కొండాపూర్(Kondapur) మార్గంలో 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఆక్రమణలు నిజమేనని తేలడంతో గురువారం కూల్చివేతలు చేపట్టారు.
పార్కులు, రోడ్లు ఆక్రమించి నిర్మించిన షెడ్లను తొలగించారు. అలాగే ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హోటల్‌ను సైతం కూల్చి వేశారు. మొత్తం 16 వేల గజాల స్థలాన్ని హైడ్రా(Hydraa) గురువారం కాపాడింది. ఈ స్థలం విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పార్క్ స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా సదరు భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో జూబ్లీ ఎన్‌క్లేవ్(Jubilee Enclave) వాసులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు