అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన బదిలీకి సంబంధించి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌ను (Dilip Kumar) ఏడాది కాకుండానే బదిలీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
నిజామాబాద్ మున్సిపాలిటీలో 60 డివిజన్లు ఉన్నాయి. నాలుగు లక్షలకు పైగా జనాభా ఉన్న మేజర్ మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలూ భారీగానే ఉన్నాయి. కాగా.. కార్పొరేషన్‌పై పట్టుసాధించేలోపే మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేయడం ఉద్యోగుల్లో చర్చకు దారితీసింది.
Nizamabad City | ప్రజాప్రతినిధులు రంగంలోకి..
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరిగినట్లు సమాచారం. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma), మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (Mla Sudarshan Reddy), ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్‌అలీ (Shabbir Ali) మున్సిపల్ కమిషనర్ బదిలీ అంశంపై సీరియస్ అయినట్లు సమాచారం. కనీస సమాచారం లేకుండా జిల్లాలో ముఖ్యమైన అధికారిని ఎలా బదిలీ చేస్తారని వారు సీఎంవోను ప్రశ్నించినట్లు తెలిసింది.
Nizamabad City | మేజర్ మున్సిపల్ కార్పొరేషన్..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పరిధిలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా ముఖ్యమైన అంశాల్లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో ముఖ్య అధికారిని బదిలీ చేస్తే.. పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ప్రజాప్రతినిధుల వాదన. నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా దిలీప్‌కుమార్ ఏడాది క్రితమే బాధ్యతలు చేపట్టారు. అంతలోనే ఆయన బదిలీ రాజకీయవర్గాల్లో.. అధికారుల్లో చర్చనీయాంశమైంది.
Nizamabad City | వెనక్కి వెళ్లిపోయిన కొత్త కమిషనర్..?
కమిషనర్ బదిలీపై ప్రజాప్రతినిధులు సీఎంవోపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన బదిలీ నిలిచిపోయినట్లు సమాచారం. కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు నిజామాబాద్‌కు గురువారం బయలుదేరిన యాదగిరిరావుకు ఉన్నతాధికారులు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో ఆయన మార్గమధ్యం నుంచే తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.