అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | కొందరు దుకాణాల నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి సోషల్ మీడియాలో (social media) డిస్కౌంట్ల పేరిట ప్రచారాలు చేస్తున్నారు. మరికొందరైతే ఫేమస్ కావాలని రూ.5కు షర్టు (Rs.5 Shirt), రూ.10కి డ్రెస్ (Rs.10 dress) అందిస్తామని ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆయా దుకాణాలకు పరుగులు పెట్టి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం డిస్కౌంట్, ప్రత్యేక ఆఫర్ అంటే ప్రజలు షాపింగ్ చేయడానికి పరుగు పెడుతున్నారు. ముందు వెనక చూడకుండా ఆయా దుకాణాలకు వెళ్తున్నారు. తాజాగా ఆర్మూర్‌లో ఓ వ్యక్తి రూ.10కే డ్రెస్ అందిస్తామని ఆఫర్ పెట్టాడు. పట్టణంలోని ఆర్కే కాంప్లెక్స్ వెనక గల ఫంకీ బాయ్స్ డ్రెస్సెస్‌లో (Funky Boys Dresses) ఈ ప్రత్యేక ఆఫర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి యువకులు భారీగా దుకాణానికి చేరుకున్నారు. ఈ క్రమంలో షాపు ఎదుట భారీగా ప్రజలు బారులు తీరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Armoor | రంగంలోకి దిగిన పోలీసులు
షాపు ఎదుట భారీగా జనం (huge crowd) ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో లైన్లో ఉన్న వారిని చెదరగొట్టారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. గతంలో మెదక్ జిల్లా (Medak district) నర్సాపూర్‌లో సైతం ఇలాగే ఓ వ్యక్తి ఆఫర్ పేరిట ప్రజలను మోసం చేశాడు. నర్సాపూర్‌లోని ‘చేతన్ మెన్స్ వేర్’ యజమాని రూ.2కే షర్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ప్రచారం చేశాడు. పది నిమిషాలు మాత్రమే ఆఫర్ ఉంటుందని చెప్పాడు. అయితే ఆ సమయానికి వందలాది మంది రావడంతో భయపడిన దుకాణ యజమాని షాప్ బంద్ చేసి పారిపోయాడు. ఇలా ఆఫర్ల పేరిట ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.