అక్షరటుడే, వెబ్డెస్క్ : Road Damage | రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు వానలు దంచికొట్టాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉధృతంగా పారాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి.
చెరువులు, ప్రాజెక్ట్లు నిండుకుండలా మారాయి. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. భారీ వర్షాలతో (Heavy Rains) రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాగులు ఉప్పొంగి పారడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. పొలాలు సైతం నీట మునిగి రైతులు(Farmers) తీవ్రంగా నష్టపోయారు. బుధవారం, గురువారం వరుణుడు శాంతించడంతో అధికారులు నష్టం లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.984 కోట్ల విలువైన ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం(Road Damage) అయినట్లు గుర్తించారు.
Road Damage | నిజామాబాద్ జిల్లాలో అధికం..
రాష్ట్రంలో మొత్తం 739 ప్రాంతాల్లో 845 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రూ.69.5 కోట్ల విలువైన 106 కి.మీ. రోడ్లు కొట్టుకుపోయాయి. సంగారెడ్డిలో 65 కి.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 96, భద్రాచాలం 78, గద్వాల్ 76, ఆదిలాబాద్లో 61 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు మార్గాల్లో నీరు రోడ్లపై నుంచి పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం వరద తగ్గడంతో అక్కడ సమస్య పరిష్కారం అయింది. రూ.40 కోట్లతో ఇందులో 200 చోట్ల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టనున్నారు.
Road Damage | నీట మునిగిన పంటలు
వర్షాల ధాటికి పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా వాగులు, నదుల పక్కన సాగు చేసిన పొలాల్లోకి వరద ముంచెత్తింది. జలాశయాలకు వరద పోటెత్తడంతో బ్యాక్వాటర్లో సాగు చేసిన పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పంట భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట నష్టంపై అధికారులు పరిశీలిన చేస్తున్నారు. నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.