అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nora Fatehi | ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మహిళపై తన భర్త, అత్తింటివారు అందరూ కలిసి అమానుషంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా (Nora Fatehi) శరీరాకృతి ఉండాలని భార్యను తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడంటూ 26 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు షాను ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఈ ఏడాది మార్చి 6న ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసే శివమ్ ఉజ్వల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో నగదు, బంగారు ఆభరణాలు, స్కార్పియో కారు సహా మొత్తం రూ. 77 లక్షల విలువైన కట్నం ఇచ్చారు. కానీ పెళ్లైన కొన్ని రోజులకే అత్తింటివారి అసలు స్వభావం బయటపడింది.
Nora Fatehi | భోజనం లేదు..
భర్త శివమ్ (Husband Shivam) తన భార్యను నిత్యం వేధించేందుకు ఓ కొత్త కారణం కనిపెట్టాడు. బాహుబలిలో ఐటెం సాంగ్‌తో (Baahubali Song) ఓ ఊపు ఊపేసిన నోరా ఫతేహీలా శరీరాకృతి కావాలంటూ రోజుకు మూడు గంటలు వ్యాయామం చేయమని షానును బలవంతం చేసేవాడు. వ్యాయామం చేయలేనప్పుడు ఆమెకు భోజనం పెట్టకుండా కడుపు మాడ్చేవాడంటూ ఆమె వాపోయింది. ఇక షాను తాను గర్భం దాల్చిన విషయం చెప్పిన తర్వాత కూడా ఆమె భర్త కుటుంబ సభ్యులు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని ఆమె తెలిపింది. తన భర్త చెల్లెలు ఓ మందు బలవంతంగా మింగించగా, అది అబార్షన్ పిల్ అనే విషయం తర్వాత తెలిసిందని పేర్కొంది.
ఆ తర్వాత తినిపించిన పెరుగులో మసాలాల (curd spice) వల్ల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై జూలై 9న ఆసుపత్రిలో గర్భస్రావం జరిగింది. జూన్ 18న షాను తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లగా, జూలై 26న తిరిగి అత్తింటికి వెళ్లిన ఆమెకు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. ఆపై ఆమెకు చెందిన నగలు, వస్తువులు కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పింది. శారీరక, మానసిక హింసను భరించలేక, షాను చివరకు ఆగస్టు 14న ఘజియాబాద్ పోలీసులకు (Ghaziabad police) ఫిర్యాదు చేశారు. ఇందులో ఆమె భర్త శివమ్, అతని కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులు, గృహ హింస, బలవంతపు గర్భస్రావానికి కారణులయ్యారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మరోసారి మహిళలపై జరుగుతున్న వేధింపులకు అద్దం పడుతోంది. ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.